Saturday, June 13, 2026 0 comments

చలో.. మరో ప్రపంచానికి! చలో.. మహాప్రస్థానానికి!

నేను నిష్క్రమించాక..
నా సమాధిపై మేధావులు శల్యపరీక్ష చేయవచ్చు,
నా కలం సృష్టించిన ప్రళయాన్ని 'మహాకవిత్వం' అని కొలవవచ్చు!
కానీ.. ఓ యువకుడా! అవన్నీ అబద్ధాలు.
నేను కోరింది కీర్తి కిరీటాల మిలమిలలు కావు,
సింహాసనాల ముందు తలవంచే అహంకారాలు అంతకన్నా కావు!
నా కలం—ఎర్రని జెండా!
నా గళం—నిప్పుల కొలిమి!
నా సిరా—శ్రమజీవుల స్వేదధార!

ముందు..
ఆ కొడవలి పట్టిన చేతులకు,
అరిగిపోయిన అరచేతులకు—
వేదాంతాల స్వేచ్ఛ కాదు,
కడుపు నింపే 'గంజి' పాఠం చెప్పు!
పళ్లెంలో అన్నం లేని వానికి..
ఆకాశమంత స్వేచ్ఛ ఇచ్చినా,వట్టి ఎండమావే!
మొద్దుబారిన మెదడుల్లో చైతన్య విస్ఫోటాన్ని రేపు,
బానిస సంకెళ్లను కోసే 'అక్షరాయుధాన్ని' ఇవ్వు!
రాచరికపు కోటగోడల పునాదులు అదిరేలా..
నా అక్షరాన్ని ఒక భూకంపమై విసిరికొట్టు!
అన్యాయం నినదించే ప్రతి అడుగడుగునా..
నా మాటను ఒక వేటకొడవలిలా ప్రయోగించు!
నేను రగిలించింది ఆరిన నిప్పుకణికను కాదు..
ఆకలి కడుపుల్లో దాగిన ప్రళయాగ్ని!
ఎక్కడ ఆకలి కేక వినబడుతుందో.. అక్కడ నా అక్షరం యుద్ధనౌకలా ప్రయోగించు!
ఎక్కడ దోపిడీ జరుగుతుందో.. అక్కడ నా పదంతో ఒక ఉప్పెనలా ముంచెత్తు!

ఈ అక్షర గర్భగోళాన్ని నీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను..
చరిత్ర పుటల్లో నిద్రపోవడానికి కాదు,
నవ సమాజ ఉషోదయాన ప్రచండ భానుడివై ప్రజ్వలించడానికి!
నీ కలానికి పదును పెట్టు..
అది ఆకలి తీర్చే నాగలి కావాలి!
చీకటిని చీల్చే కాగడా కావాలి!
శతాబ్దాల మౌనాన్ని బద్దలు కొట్టే మహా పిడుగు కావాలి!
చలో.. మరో ప్రపంచానికి!

చలో.. మహాప్రస్థానానికి! 

చీకటి సామ్రాజ్ఞి

 పగటి రంగుల పండుగులొద్దు -

ఈ జగతి కన్నుల మిరుమిట్లు వద్దు
లోకమంతా నిదురలో ఒదిగిన వేళ..
సీతాకోకచిలుకల సయ్యాటలు వీడి
కారుచీకటి కౌగిలిలో కరగిపోయిన ఓ వనమాలి!
వికసించుట నీ సహజాతము - పరిమళించుట నీ పోరాటం!
భాస్కరుడి స్వర్ణకాంతులతో నీకు పనిలేదు,
అందాల ఆరబోత అసలే తెలియదు.
బాహ్య సౌందర్యపు బడాయిలు నీ దరి చేరవు,
లోకపు అంచనాల అగాధాలు నిన్ను తాకవు.
సౌరభాల సంతలో నీ అస్తిత్వం అమ్ముడుపోదు,
మెచ్చుకోలు ముసుగుల మధ్య నీ రూపం బంధీ అవ్వదు.
ఎవరో వస్తారని ..
ఎవరో మెచ్చుకుంటారనే ఆశ లేదు.
గాలి రెక్కలపై నీవు పంపే ఈ అదృశ్య లేఖ-
నలుపును ద్వేషించి,
వెలుగును ప్రేమించే లోకానికొక జాగృతి!”
దేవుడి పాదాల చెంత చేరే యోగం లేకున్నా,
అలంకారాల ఆడంబరం దక్కకున్నా -
ముళ్ళ పొదల మాటున మౌనంగా వికసించిన నిగర్వివి!
ఈ చీకటి సామ్రాజ్యంలో నీవే పట్టాభిషిక్త మహారాణివి!
గుర్తింపు లేని గమ్యంలా..
పేరు లేని ప్రవాహంలా..
మట్టి మజిలీ క్షణం దాకా -
సర్వస్వాన్ని వెదజల్లే త్యాగమయి!
ప్రదర్శనశాల లాంటి ఈ లోకపు వీధిలో..
ప్రపంచం చప్పట్లు కొట్టకపోయినా,
ఏకాంతంగా వికసించుట నీ సాహసం!
నీ రూపం లోకం చూడకపోయినా..
నీ గమ్యం నింగికి తెలుసు,
నీ గంధం గాలికి తెలుసు!

గబ్బిలం సందేశం

 ఓ నిశీథి నాట్యకారి!

చీకటిని చీల్చు నిషాచరి!
తలక్రిందులై జగతిని దర్శించే జ్ఞానపక్షి..
నా తలక్రిందులైన లోకానికి నీకంటే మిన్న సాక్షి ఎవరు!
రేయిని లెక్కచేయని నీకు,
కారు చీకట్లో నా కన్నీటి సెగల వేడి తెలుసుగా.
గూడు చిన్నబోయి,గుండె భారమైన వేళ..
నన్ను విడనాడి వెళ్లిన నా ప్రేయసి వాకిలికి,
నా నయనాలలోని ఈ తడిని కాస్త మోసుకెళ్లవా?

జాషువా గబ్బిలం గుడిలోని దేవుడిని నిలదీస్తే..
నువ్వు నా దేవత ముంగిట నిలబడి,
ఈ పేదవాడి ప్రేమనొక్కసారి యాచించు!
ఓడిపోయిన నా ప్రేమ వ్యథను వివరించు!
నాడు కులమతాలకతీతంగా పెనవేసుకున్న పెదవులు..
నేడు సామాజిక సంకెళ్ళలో ఎందుకు చిక్కాయో నిక్కచ్చిగా ప్రశ్నించు!

లోకమంతా నిదురపోయే వేళ..
నీ రెక్కల చప్పుడుతో ఆమెను నిద్దురలేపు.
నీ కర్ణకఠోర ధ్వనితో నా అంతరంగ మదనాన్ని వర్ణించు.
కనురెప్పల వెనుక దాచుకున్న కలలు కూలిపోయాయని చెప్పు..
తలక్రిందులుగా వేలాడుతూ లోకాన్ని చూసే ఓ వింత పక్షి!
ఆమె వెళ్ళిన క్షణం నుండే నా ప్రపంచం తలక్రిందులయిందని సాక్ష్యం ఇవ్వు!
మరువలేక మోస్తున్న మానసిక సంఘర్షణ ను తెలియచెప్పు.
రాయి రప్పలను కూడా కరిగించే కవి హృదయం నాది..
కానీ తన గుండె రాయిని ఎందుకు కరిగలేదో వివరణ అడుగు.

నీ ప్రయాణంలో వెన్నెల తగిలితే..
అది నా ప్రేమలోని స్వచ్ఛత అని చెప్పు!
ఒకవేళ సందేశం విని ఆమె కంట నీరు గూడు కడితే..
ఆ కన్నీటి చుక్కలో నా నామపు తడి ఉందో లేదో..
నీ రెక్కలతో ఒక్కసారి తడిమి చూసి రా!

వెళ్లిరా పక్షిరాజమా!
ఆ విలాసాల సౌధాలలో నా వేదనను వెదజల్లి రా!
మనుషులు వినని నా దుఃఖాన్ని
ఆ ఇంటి రాతి దేవతలకైనా వినిపించి రా!
ఆ మౌన శిలైన నా ప్రేమ దేవతకు వినిపించి రా!
నా కన్నీటి చుక్కతో ఆమె కళ్ళను తడిపి,
ఆమె కాలి పారాణి సాక్షిగా నిలదీసి అడుగు!
కులాల కోరల మధ్య..
మాసిపోయిన నా పేదరికాన్ని చూసి పరిహసించిన ఆ సమాజానికి,
గాయపడిన ఒక మాల కవి హృదయపు విశ్వరూపాన్ని చూపి రా!
మట్టి మనుషులలో పుట్టిన ప్రేమ కూడా
ఆకాశం అంత గొప్పదని గుర్తుచేసి రా.
తిరిగి వచ్చేటప్పుడు..
నా కోసం కాదు,
ఆమె కోల్పోయిన ప్రేమ కోసం ఏడ్చి రా.
ఆమె పశ్చాత్తాపపు నిట్టూర్పును..
నీ రెక్కల చాటున దాచుకొని,
ఈ పేదకవి శిధిల గూటికి చేరు సోదరి.