Saturday, June 13, 2026 0 comments

గబ్బిలం సందేశం

 ఓ నిశీథి నాట్యకారి!

చీకటిని చీల్చు నిషాచరి!
తలక్రిందులై జగతిని దర్శించే జ్ఞానపక్షి..
నా తలక్రిందులైన లోకానికి నీకంటే మిన్న సాక్షి ఎవరు!
రేయిని లెక్కచేయని నీకు,
కారు చీకట్లో నా కన్నీటి సెగల వేడి తెలుసుగా.
గూడు చిన్నబోయి,గుండె భారమైన వేళ..
నన్ను విడనాడి వెళ్లిన నా ప్రేయసి వాకిలికి,
నా నయనాలలోని ఈ తడిని కాస్త మోసుకెళ్లవా?

జాషువా గబ్బిలం గుడిలోని దేవుడిని నిలదీస్తే..
నువ్వు నా దేవత ముంగిట నిలబడి,
ఈ పేదవాడి ప్రేమనొక్కసారి యాచించు!
ఓడిపోయిన నా ప్రేమ వ్యథను వివరించు!
నాడు కులమతాలకతీతంగా పెనవేసుకున్న పెదవులు..
నేడు సామాజిక సంకెళ్ళలో ఎందుకు చిక్కాయో నిక్కచ్చిగా ప్రశ్నించు!

లోకమంతా నిదురపోయే వేళ..
నీ రెక్కల చప్పుడుతో ఆమెను నిద్దురలేపు.
నీ కర్ణకఠోర ధ్వనితో నా అంతరంగ మదనాన్ని వర్ణించు.
కనురెప్పల వెనుక దాచుకున్న కలలు కూలిపోయాయని చెప్పు..
తలక్రిందులుగా వేలాడుతూ లోకాన్ని చూసే ఓ వింత పక్షి!
ఆమె వెళ్ళిన క్షణం నుండే నా ప్రపంచం తలక్రిందులయిందని సాక్ష్యం ఇవ్వు!
మరువలేక మోస్తున్న మానసిక సంఘర్షణ ను తెలియచెప్పు.
రాయి రప్పలను కూడా కరిగించే కవి హృదయం నాది..
కానీ తన గుండె రాయిని ఎందుకు కరిగలేదో వివరణ అడుగు.

నీ ప్రయాణంలో వెన్నెల తగిలితే..
అది నా ప్రేమలోని స్వచ్ఛత అని చెప్పు!
ఒకవేళ సందేశం విని ఆమె కంట నీరు గూడు కడితే..
ఆ కన్నీటి చుక్కలో నా నామపు తడి ఉందో లేదో..
నీ రెక్కలతో ఒక్కసారి తడిమి చూసి రా!

వెళ్లిరా పక్షిరాజమా!
ఆ విలాసాల సౌధాలలో నా వేదనను వెదజల్లి రా!
మనుషులు వినని నా దుఃఖాన్ని
ఆ ఇంటి రాతి దేవతలకైనా వినిపించి రా!
ఆ మౌన శిలైన నా ప్రేమ దేవతకు వినిపించి రా!
నా కన్నీటి చుక్కతో ఆమె కళ్ళను తడిపి,
ఆమె కాలి పారాణి సాక్షిగా నిలదీసి అడుగు!
కులాల కోరల మధ్య..
మాసిపోయిన నా పేదరికాన్ని చూసి పరిహసించిన ఆ సమాజానికి,
గాయపడిన ఒక మాల కవి హృదయపు విశ్వరూపాన్ని చూపి రా!
మట్టి మనుషులలో పుట్టిన ప్రేమ కూడా
ఆకాశం అంత గొప్పదని గుర్తుచేసి రా.
తిరిగి వచ్చేటప్పుడు..
నా కోసం కాదు,
ఆమె కోల్పోయిన ప్రేమ కోసం ఏడ్చి రా.
ఆమె పశ్చాత్తాపపు నిట్టూర్పును..
నీ రెక్కల చాటున దాచుకొని,
ఈ పేదకవి శిధిల గూటికి చేరు సోదరి.

No Response to "గబ్బిలం సందేశం"

Post a Comment